
మనిషికి అవసరం అన్ని నేర్పిస్తుంది.ఏమీ తెలియని వాడు కూడా పట్టుదలతో అన్ని నేర్చుకుని (కనీసం బ్రతకడం ఎలాగో)బ్రతకగలడు.ఎట్టి పరిస్థితిలోనూ నిరాశ ఆవరించకుండా జాగ్రత్తపడండి చాలు,మంచి రోజు తప్పకుండా ఒకరోజు ఆలశ్యమయినా దానంతటదే వస్తుంది వెతుక్కుంటూ, అప్పుడు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడండి.ఇది నా అనుభవం నాకు నేర్పిన పాఠం.ఇటువంటి ఆర్ధిక మాంద్యపు గడ్డు పరిస్థితిలో ఎవరికన్నా ఉపయోగ పడుతుందేమో(కనీసం కొంచం ధైర్యం వచ్చినా చాలు) అని రాస్తున్నా.
2001 ఏప్రిల్-మే కాలంలో అప్పటికి హైదరాబాద్ లో నేను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు కొత్త పవర్ ప్రోజెక్ట్స్ ఏమీ రాలేదు ఉన్నది కూడా ఏదో ప్రభుత్వం క్లియరెన్స్ ఇంకా రాలేదనో, రాదనో మొత్తానికి ఒక్కొక్కళ్ళనీ ఇంటికి వెళ్ళండన్నారు.చాణక్యుడు చెప్పినట్టు నిలువుగా పెరిగిన చెట్లు ముందు నరుకుతారని నిజాయితీగా పనిచేసేవాళ్ళని కూడా ముందే పీకేస్తారు అన్నిచోట్లా.అదే మనకి అనువర్తిస్తుంది ఇక్కడ కూడా.దానికి ముందే సిద్ధపడ్డానేమో కాంతికి ముందే చెప్పి ఉంచా ఇదీ పరిస్థితి మనం కొంచం జాగ్రత్తగా ఉండాలి కొన్నాళ్ళు అంటే ఇంకో ఉద్యోగం దొరికేంతవరకూ,అంటే భారత దేశపు ఇల్లాలు కదా ఊ అంది(ఇలాంటోడ్ని కట్టుకున్న ఏ ఇల్లాలయినా ఇంతకంటే ఏమి చెప్తుందీ, ఏమి చేస్తుందన్నది అసలు విషయం).
సరే ఏదో ఆ రోజు రానే వచ్చింది ఓ మూడు నెల్ల జీతం చెతిలో పెట్టి సాగనంపారు ఇంటికి, అలా ఒక అవతారం ముగిసింది.
ఇంకో కొత్త అవతారం ఎత్తాలి ఎలా సమయం ఆసన్నమయింది,కానీ ఏ అవతారమా అని అలోచిస్తూ ఒక నెల మెల్లిగా గడిపేసాను ఈలోపున బంధు మిత్రులకి తెల్సిపోయింది విషయం,అలా పాకి వైజాగులో ఉంటున్న మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది అన్నయ్య ద్వారా వాడేదో బేంక్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు.అన్నయ్య అడిగాడు భోజనం చేస్తూ వైజాగు వచ్చెయ్యమని అందరమూ కలిసే ఉందామని కాని నేను ఒప్పుకోలేదు.ఏదో ఒక ఉద్యోగం వచ్చేవరకూ ఇక్కడే ఉండి మేనేజ్ చేస్తాలే అని చెప్పేసా.వీడెలాగూ మాట వినేరకం కాదని తెల్సి అన్నయ్య కూడా వదిలేసాడు. మధ్యలో మా మావా, పెద్దాయనా,తోడల్లుడి పలకరింపులు పరమర్శలూ అవుతూనే ఇంకో నెల గడిచింది.ఉద్యోగ ఫలితం శూన్యం,చిల్లర స్టేజ్ కి వచ్చేస్తున్నాము మెల్లిగా.
కాని అప్పుడు కూడా ఒఖ్ఖ మాటనని(అంటే ఇంక ముందు జరుగుడు ఎలాగా ఏమిటీ అని,బహుశా ఆ ఒక్క ధైర్యమే నాకు ధైర్యాన్నిచ్చిందేమో మరి) కాంతిని మెచ్చుకోవాలి నిజంగా ఏమిటో గ్యారంటీ,ఆ నమ్మకం నాకే ఆశ్చర్యంగా ఉండేది ఇప్పటికీ.
ఇద్దరు పిల్లలకీ ఎందుకు నాన్న ఇంట్లోనే ఉంటున్నాడో విషయం తెలిసినా అర్ధం అయ్యే స్టేజ్ కాదు కాబట్టి పర్వాలేకపోయింది.
సరే ఇంతలో మా తోడల్లుడి నించి ఫోను,చేసిన ప్రయత్నాలు చాలు ఆ వచ్చే ఉద్యోగమేదో ఇక్కడున్నా వస్తుంది కదా తట్టా బుట్ట సర్దుకుని వైజాగొచ్చేసి ఏదో ఒకటి భుక్తికోసం ప్రయత్నించమని సలహా. ఆలోచిస్తే అదీ సమంజసమే (చేసేదీ చెయ్యగలిగిందీ కూడాఏమీ లేదు)అనిపించింది తర్వాత ఫోన్ చేసి అలాగే అని చెప్పేసా. మెల్లిగా తర్వాత రోజునించీ ఒక్కొక్క పనీ కానిచ్చి(పిల్లల స్కూల్ టి.సీ.లు,గ్యాస్ ట్రాన్స్ ఫర్ వగయిరాలు) వైజాగు వెళ్ళడానికి రేడీ అయ్యాము ఒక వారంలో.
తిరిగి తిరిగి ప్రయాణం ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి చేరాము.వైజాగ్ చేరగానే బీచ్ రోడ్ లో ఓ ఇల్లు అద్దెకి దొరికింది మా పెద్ద అక్కా వాళ్ళింటి దగ్గర.సామాన్లన్నీ సర్దుకోడం పిల్లల్ని సత్యసాయి స్కూల్లో జాయిన్‌చెయ్యడం జరిగాయి(ఫీజులు,ఇంటద్దె అడ్వాన్సుతో సహా మా తోడల్లుడే కట్టాడు).రోజూ వచ్చి వెళ్తుండేవారు అందరూ(అసలే మాకు జనాల పుట్ట ఎక్కువ వైజాగులో, అందులోనూ బీచ్ రోడ్లో ఇల్లూ) సరదాకో, సమాచారానికో, విమర్శకో, అనునయించడానికో, అవకాశానికో(బాగా అయింది వీడికి అని)ఏదో ఒకదానికి.మెల్లిగా ఒక వారం గడిచింది.
ఈ ఏడు రోజుల్లో ఆ ఇంటి మహత్యమో,మా పరిస్థితి ప్రభావమో తెలియదు గానీ పగలు బాగానే గడిచేది కానీ రాత్రి తెల్లరాలంటే ఒక విధంగా నరకం చూశామని చెప్పొచ్చు.నిద్ర పట్టదు,ఏడుపు రాదు,ఇద్దరం ఏమి మాట్లాడుకోవాలో తెలియదు,ఏమి చెయ్యాలో(ఆత్మహత్యా..ఉహూ ఆఒక్కటీ తప్పితే ఇంకేదయినా… ఇంకేంటీ…ఏమో నాకేమెరుక) తెలియదు,అందరూ ఉన్నారన్న ధైర్యం ఉంది కానీ ఎన్నాళ్ళిలా,ఏమో తెలియదు?కాని ప్రత్యక్ష నరకం మాత్రం ఇదే...
ఆ పైవారంలో వెంటనే ఇల్లు మార్చేసాము మా తోడల్లుడి ఇంటికి కూతవేటు దూరంలోకి(బహుశా ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడతాయనేమో ఇదివరకు ఉమ్మడికుటుంబ వ్యవస్థ ఉండేది అనిపిస్తుంది)...కొంచం మనశ్శాంతి చిక్కింది.
ఇల్లు అక్కడ తీసుకున్నామన్న మాటే కానీ(అది పూర్తిగా సామాన్లు పెట్టుకోడానికే ఉపయోగపడింది) తిండీ నిద్రా అన్ని పూర్తిగా తోడల్లుడింట్లోనే.ఇక బంధుగణానికి మంచి కాలక్షేపం చెప్పుకోడానికి మా గురించి, కాంతి వాళ్ళింట్లో వంటమనిషి(ఇంకా ముందుకెళ్ళారేమో కూడా రాయడానికి బాగుండదు), నేనూ పిల్లల్లూ పనిమనిషులూ,మా తోడల్లుడు చాలా అదృష్టవంతుడు(ట) పైసా ఖర్చు లేకుండా ఇంతమంది దొరికినందుకు (ఇవన్నీ విని నవ్వుకునే వాళ్ళం మేమంతా కూర్చుని మాట్లాడుకుంటు న్నప్పుడు).
నా జేబులో ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టనీకుండా (ఉంటే కదా నాదగ్గర)ఏడాదిన్నర పాటు పోషించారు మొగుడూ పెళ్ళం కూడా నన్నూ నా పిల్లల్నీ మహనుభావులు(ఒఖ్ఖ మాట అనకుండా,
కనీసం నాకు సంపాదన లేదు అన్న బాధ తెలీకుండా) ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియదు కానీ...
సరే ఓ రోజు అలా బయటకి వెళ్ళి త్రినేత్రా సూపర్ మార్కెట్ లో సరుకులు తెచ్చుకుందామని వెళ్ళాము అందరం కల్సి.సామాన్లన్నీ కొనేసి బిల్ పే చేస్తుంటే వచ్చింది ఆలోచన అవును మనమే ఒక సూపర్ మార్కెట్ లాంటిది పెడితే,ఉన్న మన జనాల్లో కొంతమంది కొన్నా మిగతాది మంచి లొకేషన్ అయితే(అంటే ఎక్కువగా ఫ్లేట్స్ అవీ ఉన్న లొకేషన్)మామూలుగా జరుగుబాటుకి పెద్ద లోటుండక పోవచ్చేమో అనిపించింది.సరే పనులన్నీ కానిచ్చి ఇంట్లో సమవేశమయ్యాము అందరం.ఆలోచన బాగానే ఉందనిపించింది. చదివిన చదువేంటి చేసే పనేంటి అంటూ అనుకున్నా బ్రతుకుతెరువు ముఖ్యం అన్న మాటకే ఓటు పడ్డంతో ఏదో ఒకటి మొదలెడితే ఆపైన మిగతా విషయం చూడచ్చు అనుకుని ఫైనాన్సు తోడల్లుడు ఇస్తానంటే మళ్ళీ తీసుకునే ఒప్పందం మీద(ఎప్పటికయినా)ఒప్పుకుని ఆ తర్వాత రోజునించే దానికి సరిపడా విధి విధానాలన్నీ పోగుచేసుకుని, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మెల్లిగా ఒక 200దగ్గర ఫ్లేట్స్ ఉండే ఏరియా లో ఒక షాప్ ఒకటి తీసుకుని మొత్తానికి “సాయి బాలాజీ సూపర్ మార్కెట్” పేరు తో ప్రారంభోత్సవం చేయించాము.
మెల్లిగా బాలారిష్టాలు అన్నీ దాటుకుంటూ ఒకనెల గడిచింది.పొద్దున్నే ఎలాగూ లేవడం
అలవాటయినా షాప్ దగ్గర పిల్లల స్కూల్స్ కి వెళ్ళేలోపు షాప్ తెరిస్తే కొంచం సేల్స్(ఈ పాలూ, బ్రెడ్డూ, గుడ్లూ, పెన్ను,పెన్సిల్,మేప్స్ ఇలా ఏదో ఒకటి)అవుతాయని ఉదయం 6గంటలకి మొదలెట్టి రాత్రి 10గంటల షాప్ మూసే వరకూ కూర్చోవాల్సి వచ్చేది(మధ్యాహ్నం ఒక గంట విరామం తప్పిస్తే).
సరే కొంటారనుకున్న మా జనాలెవరూ కొనకపోగా(ఇళ్ళకి డెలివరీ ఇస్తామన్నా కూడా)షాప్ పెట్టిన ఏరియాలో జనాలు మాత్రం బాగానే సహాయపడ్డారు(మా ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళ వాళ్ళకి చెప్పి ఇలా)సామాన్లు కొని కనీసం మానవత్వంతో.అప్పటికే ఆ ఏరియాలో ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నా (ఇవి మెయిన్ రోడ్దుమీద ఉన్నాయి)నా షాప్ కొంచం ఇళ్ళున్న లొకేషన్ లోనే ఉండడం కొంచం లాభించింది కూడా.సరే తెలియని దార్లోకి వెళ్ళినా మెల్లిగా పర్వాలేదు ఫెయిల్ అవలేదు అనిపించింది. కానీ ఇదెన్నాళ్ళు మళ్ళీ అలోచన.బాగా ఆకలేసినవాడికి ఏది దొరికితే అది తిని, అదయ్యాక ఇంకోటేదో ఉంటే బాగుండునని,ఇంకా పంచభక్ష్యపరమాన్నాలుంటే బాగుండునని ఇలా మనిషి సైకాలజీ పని చెయ్యడం మొదలెట్టింది. ఈలోపున ఇంకో స్నేహితుడు హైదరాబాద్ నించి వచ్చి గురూ నా ప్రోడక్ట్స్(అతనికి ఇండస్ట్రియల్ సేఫ్టీ,ఫైర్ ఫైటింగ్ డీలర్‌షిప్స్ ఉన్నాయి)కి వైజాగ్ రెప్రెజెంటేటివ్ గా ఉంటావా,ఒక్కణ్ణి చేసుకోలేకపోతున్నా అని అడిగాడు.సరే అతని తరపున నేను బిజినెస్ డెవెలప్ చేసేట్టు,ఇంకో కుర్రాడ్ని పెట్టుకుని ఆ పనులకి అతన్ని తిప్పేట్టు మనం ఫోన్ లో విషయాన్ని చక్కబెట్టేట్టు(స్వామి కార్యం, స్వకార్యం రెండూ జరిగేట్టు)అతనితో ఒప్పందం చేసుకుని ఇంకొంచం ఊపిరి పీల్చుకున్నా.తర్వాత రోజు నించి మధ్య మధ్యలో ఒక గంట కాంతి వచ్చి షాప్ లో కూర్చునే ఏర్పాటు చేసి తనకీ అలవాటయ్యే వరకూ ఉండి మెల్లిగా వేరే వ్యాపకాన్ని కూడ నడిపిస్తూ కొన్నాళ్ళు గడిపాము.ఓక ఏడాది గడిచింది.లాభమూ లేదు నష్టమూ లేదు అలాగని మిగిలిందీ లేదు,ఖాళీగా మాత్రం లేను అంతే.
ఈలోపున మా షరీఫ్ చేత కూడా ఒక స్టేషనరీ షాప్ పెట్టించాను వాళ్ళింటికి దగ్గర్లోనే,ఆ బిజినెస్ కి కావాల్సిన కొన్ని ఆర్డర్స్ కూడా ఇప్పించాను(శంకరాభరణం లో శంకర శాస్త్రి ఏమయ్యా దాసూ కలిసే సుఖాల్ని అనుభవించాము,కష్టాల్ని కూడా కలిసే అనుభవిద్దాము అని అన్నట్టు).
ఓ రోజు 10గంటల ప్రాంతంలో షాప్ లో ఉండగా నా స్నేహితుడు “జెట్టీ” దుబాయి నించి సెలవులో వచ్చాడు,ఏంటి బాస్ ఎన్నాళ్ళయింది చూసి నిన్ను,ఇదేంటి ఈషాప్ వ్యవహారం అంటూ.అలా కష్టం సుఖం చెప్పుకుంటూ ఉండగా వాడే అన్నాడు మన మిశ్రా(అంతకు ముందు నన్ను తీసేసిన కంపెనీలో మేమంతా కల్సి పనిచేసాము) దుబాయిలో వేరే కంపెనీలో చేరాడు.వాళ్ళకి కొత్త ప్రోజేక్ట్ ఒకటి వచ్చిందట, జనాలు కావాలి కదా కనుక్కో ఒకసారి అని ఓ సలహా ఇచ్చి మళ్ళీ కలుద్దాము అని వెళ్ళిపోయాడు. సరే వాడు అలా వెళ్ళాడో లేదో ఫోన్ మోగింది,ఏదో ఆర్డర్ బుకింగేమో అని పెన్ను స్లిప్పూ పట్టుకుని ఫోన్ ఎత్తగానే షరీఫ్ గాడు ఆల్మోస్ట్ అరుస్తున్నట్టే మాట్లాడుతున్నాడు,సార్ పప్పుగారూ ఇప్పుడే మన అశోక్‌మిశ్రా ఫోన్ చేశాడు నాకు దుబాయ్ నించి మీ ఫోన్ నంబర్ మిస్సయిందట నాకు చేసాడు.వాళ్ళకేదో ప్రోజెక్ట్ కి మన పోస్టులు ఉన్నాయట నాకు ఇంటెరెస్ట్ ఉందా లేదా అని అడిగాడు,మీ విషయం కూడా కనుక్కోమన్నాడు,ఏమి చేద్దాము చెప్పండి అంటూ.
నువ్వు ఫోన్ పెట్టి వెంటనే నా దగ్గరకి రా అని చెప్పిన పది నిముషాల్లో వాడు నా ఎదురుగా ఉన్నాడు ఆయాసపడుతూ స్కూటర్ మీదొచ్చినా కూడా.వాడు స్థిమిత పడ్డాక ఏంటి సార్ ఏమి చేద్దాము అంటే చెప్పాను షరీఫ్ ఈ అవకాశమే నిజమయితే,మనం ఈ ఏడాదిన్నరా ఏదో అజ్ఞాతవాసం చేసాము అనుకుందాము సింపుల్ గా, నీ షాప్ నీ తమ్ముడికి ఇచ్చెయ్ నాది అమ్మేస్తాను లాభమో నష్టమో,నడు వెంటనే అశోక్ గాడితో మాట్లాడి నిజానిజాలేంటో కనుక్కుందాము అని టెలిఫోన్ బూత్ కి వెళ్ళాము ఇద్దరం కల్సి.నాకెందుకో ఈ జెట్టి గాడు రావడం ఇలా సలహా ఇవ్వడం వెంటనే షరిఫ్ ఫోన్, విషయం జరిగేట్టుగానే అనిపించింది,కాని చిన్న సందేహం.
అశోక్ గాడి మొబయిల్ కి ఫోన్ చేశాం,చెయ్యగానే వాడు కుశల ప్రశ్నలేసి విషయం చెప్పాడు నీకింత ఇస్తాము,షరీఫ్ కింత ఇస్తాము వస్తారా అన్నాడు,ఫోన్లోనే తలూపేసాము ఇద్దరమూ,అయితే వెంటనే సి.వి,పాస్‌పోర్ట్ కాపీ ఫేక్స్ చెయ్యండి అన్నాడు.షాప్ గురించి చెప్తే అమ్మి పడెయ్ ఎంతొస్తే అంతకి, మీరు మాత్రం వారంలోపు రెడీ అయిపొండి బయల్దేరడానికి అని తెగేసి చెప్పాడు.
ఇంకా అనుమానం తొలుస్తుంటే(ఫేక్స్ అంటాడు,వారం అంటాడు ఎలా)మా ఇంకో ఫ్రెండ్ రెడ్డికి ఫోన్ (దుబాయ్)చేసాము.అతను వెంటనే చెప్పాడు అశోక్ చెప్పేది నిజమే కానీ వీసా చేతికి వచ్చేవరకూ రిస్క్ చెయ్యద్దు అని సలహా ఇచ్చాడు.షాప్ విషయం అయితే బేరం ఆడి ఉంచుకోండి ఈలోపున వీసా వచ్చేస్తే సెటిల్ చేసుకోండి అని సెలవిచ్చాడు.హమ్మయ్య ఘెట్టిగా ఊపిరి పీల్చుకున్నాము ఇద్దరం ఒక్కసారి.
వెంటనే ఆ పనులన్ని పూర్తిచేసి షాప్ కూడ గమ్మునే కట్టేసి ఇంటికొచ్చి ఆ వార్త చెప్పేసరికి అందరి కళ్ళల్లోనూ ఆనందం. డైనింగ్ టేబిల్ చుట్టూ కూర్చున్న మాకు ఎవరి కళ్ళల్లో నీళ్ళున్నాయో తెలియదు కానీ అందరికి ఎదరి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళే కనిపించాయి మసకమసకగా అప్పుడు మాత్రం.
ఒక తుఫాను వెలిసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం,
ఒక యుద్ధం ముగిసిన తర్వాత మిగిలిన ప్రశాంతత,
చిన్న ఆలోచనకీ..ఇంకొంత ఆవేశానికీ మధ్య గీత...
ఒక చావుకీ బ్రతుకుకీ మధ్య ఉన్న జీవితం…అంతే...
కొన్ని నాకు నచ్చిన కోట్స్(యండమూరి నవలలనించి)
డబ్బు సంపాదన పూల పానుపు కాదు.ఆ పరమపదసోపానంలో ఏదో ఒక పడగనీడన ప్రతీ మనిషీ రోదించే ఉంటాడు.కనీసం నిశ్శబ్దంగా నయినా రోదించకుండా లక్ష్మిని చేపట్టివాడెవడూ లేడు... టాటా బిర్లాలతో సహా...
ఒక సమస్య వల్ల మనకి నష్టం కలిగించవచ్చు.కానీ దాని వల్ల ఒక మంచి కూడా జరుగుతుంది. ఎలుకలు బొద్దింకలు బాక్టీరియా వైరస్ ఇలాంటివన్ని కీడూ చేసేవే.కానీ క్రిమిసమ్హారక మందులు, రోగనిరోధక టీకాలు చివరికి ఎలుకల బోనులు తయారుచేసేవారి ఉపాధి కూడా దీని మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నాడు సోక్రటీస్.తత్వానికి పరాకాష్టయిన ఈ స్టేట్ మెంట్ చాలా చేదు సత్యం. ప్రపంచంలో మనిషికి కీడు చేసే ఈ ప్రాణులే లేకపోతే కొన్ని కోట్ల మంది నిరుద్యోగులవుతారు.చివరికి మరణం కూడ ఓటమి కాదు.ఒక మనిషి మరణం ఒక కాటి కాపరిని, ఒక కట్టెలు అమ్మేవాడ్ని పోషిస్తుంది అన్న విషయం తెల్సుకుంటే ప్రతీ సమస్యకీ ఏదో ఒక లాభముండే తీరుతుందన్న సత్యం బోధపడుతుంది.
అన్నీ కోల్పోయినప్పటికీ,జీరో బేస్డ్ స్థాయి నించీ జీవితాన్ని మొదలెట్టచ్చు…
మనం గెల్చినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళూ,మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టేవాళ్ళూ నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా,ఎంత పోగొట్టుకున్న తేడా ఏమీ ఉండదు...(ఇది మాత్రం నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి)
21 వ్యాఖ్యలు:
Too good post!!!
idee satyaM !
baagaa cheppaaru
డబ్బు సంపాదన పూల పానుపు కాదు.ఆ పరమపదసోపానంలో ఏదో ఒక పడగనీడన ప్రతీ మనిషీ రోదించే ఉంటాడు.కనీసం నిశ్శబ్దంగా నయినా రోదించకుండా లక్ష్మిని చేపట్టివాడెవడూ లేడు... టాటా బిర్లాలతో సహా... EXCELLENT
ఒక తుఫాను వెలిసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం,
ఒక యుద్ధం ముగిసిన తర్వాత మిగిలిన ప్రశాంతత,
చిన్న ఆలోచనకీ..ఇంకొంత ఆవేశానికీ మధ్య గీత...
ఒక చావుకీ బ్రతుకుకీ మధ్య ఉన్న జీవితం…అంతే!
nice presentation
Very good post. Meeku antha shayam chese bandhuvulu unnanudku chala lucky fellow.
చక్కటి విషయాన్ని ఎంత వినమ్రంగా చెప్పారు. సరదాగా చదివిన బ్లాగులే ఇప్పటివరకూ, ఇలా మనసును కదిలించినవి తక్కువ.డబ్బు సంపాదన పూల పానుపు కాదు.ఆ పరమపదసోపానంలో ఏదో ఒక పడగనీడన ప్రతీ మనిషీ రోదించే ఉంటాడు.కనీసం నిశ్శబ్దంగా నయినా రోదించకుండా లక్ష్మిని చేపట్టివాడెవడూ లేడు... టాటా బిర్లాలతో సహా.అభినందనలు.
very fascinating.
శ్రీపాద సుబ్రహమణ్యశాస్త్రిగారు సుమారు ఎనభయ్యేళ్ళ క్రితం మార్గదర్శి అని ఒక గొప్ప కథ రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ ఆ కథ చదివిన ఫీలింగ్ కలిగింది నాకు
శ్రీనివాసు గారు,
ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. జీవితం అంటే ఏమిటో బాగా అర్ధమైఉంటుంది కదా!
మీరు పడిన కష్టాలకు బాధపడ్డా మంచి తోడల్లుడిని పొందిన అదృష్టవంతులు మీరు
"రాత్రి తెల్లరాలంటే ఒక విధంగా నరకం చూశామని చెప్పొచ్చు.నిద్ర పట్టదు,ఏడుపు రాదు,ఇద్దరం ఏమి మాట్లాడుకోవాలో తెలియదు,ఏమి చెయ్యాలో(ఆత్మహత్యా..ఉహూ ఆఒక్కటీ తప్పితే ఇంకేదయినా… ఇంకేంటీ…ఏమో నాకేమెరుక) తెలియదు,"
"కాంతి వాళ్ళింట్లో వంటమనిషి (ఇంకా ముందుకెళ్ళారేమో కూడా రాయడానికి బాగుండదు), నేనూ పిల్లల్లూ పనిమనిషులూ,మా తోడల్లుడు చాలా అదృష్టవంతుడు(ట) పైసా ఖర్చు లేకుండా ఇంతమంది దొరికినందుకు"
మొత్తం కళ్ళముందు ఒక రీలు సినిమా చూపించారు కదండీ.. పై రెండు సందర్భాలు కంట నీరు తెప్పించాయి.
కష్టపడి సుఖపడగలం.. కాని సుఖపడి కష్టపడలేమట . ఈ కష్ట సుఖాలలోనే కదూ బార్య భర్తల ఇరువురిమధ్య అనుబంధం మరింత గట్టిపడేది. కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ అన్నారు.... ఇన్ని కష్టాలలో మీ కుటుంబం మీకు చెంతన ఉంది కాబట్టి మీకు కాస్త నమ్మకము, చేయూత, ధైర్యం కలిగాయి. ఒంటరి పోరాటమయ్యుంటే ఇంతటి అనుభవం ఉండేది కాదు, కష్టపడ్డాము అనుకొనేవారు అంతె. మీతో పాటు సమానంగా మీ కుటుంబం కూడా కష్టాలను పంచుకొంది చూడండి అది ఇక్కడ చెప్పుకోతగ్గ గొప్ప విషయం. . కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి? కావడి కొయ్యేనోయ్! కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయ్! అని పిల్లల పిల్లలికి పిట్టకథలు చెప్పుకొంటూ 60 యేళ్ళయినా , 100 యేళ్ళయినా తీపి చేదు అనుభూతులని కలబోసుకొనే చక్కటి వివాహానుబంధ సాంప్రదాయం మనది.
ఇవి చాలవా మన హృదయాలలో పదిలంగా భధ్రపరుచుకొని జీవితాంతం నెమరేసుకోడానికి. ఏది ఏమైనా మీ ఈ అనుభవాల (కష్టాల అని అనాలేమో) దొంతర నన్ను ఇంత పెద్ద పోస్ట్ లాంటి వ్యాఖ్య రాసేలా చేసింది. అసంధర్భం అనిపిస్తే మన్నించండి.
కొ.మె: నవలల్లోనివి సినిమాల్లోని కోట్స్ చాలా బాగున్నాయి.
నా కధ నీకెలా తెలిసింది అన్నా?
:):)
Wonderfil శ్రీనివాస్ గారు. కష్టాల్లో ఉన్నపుడు సాయం చేసేవాళ్ళే అసలయిన ఆత్మీయులు. అలాంటి ఆత్మీయులు ఉన్నవారు చాలా అదృష్టవంతులు.
పప్పు వారు చాలా ఇబ్బంది పెడ్తున్నారు...మనకున్నవీ లేనివీ ఇలా చూయించేస్తే ఇబ్బందికాక మరేమిటీ అంట?కష్టాలు దాదాపుగా అందరికీ కాస్త అటూ ఇటూ ఒకేలా ఉన్నా ఆదుకునే సన్నిహితులు దొరకటం కన్న మించిన సంపద మరొకటిలేదు.ఆ విధంగా మీ శ్రీమతిగారు వారి సోదరి మీ తోడల్లుడుగారు మిగిలిన అందరూ ఇలా అందరికీ అండదండలందించే వారుఉంటే ఎంతబాగుండనిపిస్తుంది నాకు.
ఏది ఏమయినా పప్పు వారు త్వరలో ప్రముఖరచయిత,వ్యాసకర్త అయ్యే ప్రమాదం కనిపిస్తుంది నాకు :)
లక్ష్మి,దుర్గేశ్వర,మురళి,హరేకృష్ణ,సునీత గార్లకు ధన్యవాదాలు.
వెంకట్ గణేష్,విజమోహన్,జీడిపప్పు గార్లు..."ఒక మనిషి కష్టం లో ఉంటే ఆదుకోడానికి ప్రాణస్నేహమే అక్కర్లేదు,మామూలు స్నేహం చాలు,ఇంకా ఎదగగలిగితే మానవత్వం చాలు".నాకు తోడల్లుడి రూపం లో దొరికారు అంతే.ఇంకా చాలా మంది మిత్రుల రూపంలో కూడా..
గురువు గారూ..గుండెల్లో తడిమారు స్వామీ,ధన్యుడ్ని...
ఆదిలక్ష్మి గారు..అనుకోడానికేముందండి.నిజమే జీవిత సత్యం బోధపడింది.
రమణి గారూ..ధన్యవాదాలు,
బాచి బాబూ..సోదరులమే కదా తెలియకుండా ఎలా ఉంటుంది మరి,
రాజేంద్రా...మరీ అంత భయపడకండి...
చక్కగా జీవిత సత్యాలను చెప్పారు మాకు.
శివా...చాలా రోజుల తర్వాత...ఎలా ఉన్నారు?
మీరు కూడ ఇంకెవరికైనా అవసరంలో ఆదుకొండి చాలు.
నా అనుభవంలో సాయం చేసే వాళ్ళకి అవసరం ఐనప్పుడు ఆదుకునే వారు దొరకరు. ఒక వ్యక్తి ద్వార తల్లి దండ్రులు తోబుట్టువులు ఎంతగానో లాభపడి ముఖం చాటేసేవారు ఉన్నారు.
మీకు కలిగిన ఇబ్బంది నాకూ జీవితంలో జరిగింది. కాని మీకులా ఎవరిసాయమూ దొరకలేదు. గతంలో నా నుండి ఎంతో పొందిన రక్తసంబంధీకుల స్వభావం ఏమిటో నాకు తెలిసిపోయింది.
నా అదృట్ష్టం ఏమిటంటే నా దగ్గర ఉన్న డబ్బు నన్ను ఆదుకుంది.
మొదటి నుండీ బదిలీలపై తిరిగే మేము సరిగ్గా పరాయి రాష్ట్రం లో ఉన్నప్పుడే నేను గతంలో ప్రమోషన్ విషయంగా జరిగిన అవకతవకపై డిపార్ట్ మెంట్ పై వేసిన కేసు హియరింగ్ కి రావటం. అప్పుడే నా శ్రీమతి ఆరోగ్యం పూర్తిగా దిగజారటం జరిగింది.
దానితో వైద్యం, మరియు కేసు నిమిత్తమై నేను హైదరాబాద్ కి తిరిగి రావటం జరిగింది.
అక్కడ నా శ్రీమతి తల్లి దండ్రుల ఇల్లు ఒకటి ఖాళీగా గెస్టు హౌస్ లా ఉంచుకునే వారు. వాళ్ళు పక్కనే వేరొక టౌన్ అప్పుడప్పుడు నుండి వచ్చి పోతూ ఉండేవారు.
మేము, పిల్లలు అక్కడ దిగిన నాలుగు రోజులకే నా శ్రీమతి తల్లి దండ్రుల ప్రవర్తన మారిపోయింది (దానికి కారణం మాకు తరువాత తెలిసింది మా ఆవిడ తల్లికి ఆమె చెల్లెలు వాళ్ళు మీ అల్లుడి ఉద్యోగం ఊడి కేసు ఐఉంటుంది, లేకపోతే ఎవ్వరూ ప్రమోషన్ కొరకు కోర్టుకి రారు అంటూ ఎన్నో చెప్పారట ఆ విషయం మాతో అడగలేదు తరువాత కొందరు బంధువుల ద్వార తెలిసింది ఆరోజుల్లో నీ ఉధ్యోగం ఊడిందనే పుకార్లు వచ్చాయి అని.)
దానితో నా భార్య తండ్రి తల్లి మర్నాడు టౌన్ కెళుతూ పాలుమొదలైనవన్నీ మానేయమని పాలవాడితో, పేపర్ వాడితో చెప్పి వెళ్ళిపోయారు. మాతో ఏమీ చెప్పలెదు.
అప్పుడప్పుడూ నా భార్య తల్లి వస్తుండేది అనారోగ్యంతో ఉన్న ఈవిడని నానా మాటలని ఉత్త పుణ్యానికే పెద్ద గొడపెట్టుకుని వెళ్ళెది. మాకు ఇందంతా ఏమిటో తెలియకుండానే నెల దఘచింది మా సరుకులు మేమే తెచ్చుకుంటూ ఆ ఇంట్లో ఉన్నాం.
నా భార్య యొక్క తల్లి దండ్రులు నివసించే టౌన్ లో గతంలో నేను ఒక ఇంటిని కొని వాళ్ళకే అప్ప్జెప్పాను వాళ్ళే అద్దె వసులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేనెప్పుడూ ఆ డబ్బు అడగలేదు. ఇలాంటి పరిస్తితులలో కూడా నేను వాళ్ళని ఆడబ్బు అడగలేదు, లీవులో ఉన్నారు కేసుకై అవసర పడుతుందేమోనని ఇవ్వాల్సిన వాళ్ళూ ఇవ్వలేదు.
రెండు నెలలు వాళ్ళ ప్రవర్త ఎందుకలా మారిందో తెలియక మా చిరాకుల మధ్యా ఎంతో నరకం అనుభవించాం.
అప్పుడు మెల్లిగా అర్ధంకాసాగింది. మేం ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉండటం వీళ్ళకి ఇశ్టం లేదు అనేది.
ఓ రోజు ఆమె తల్లి పెద్దగొడవచేసింది ఆమె అసహ్యపు మాటలకి మేము కట్టు బట్టలతో బయటకి వచ్చి గతంలో నేను ఎక్కువ రోజులు ఉద్యోగం చేసిన ఊరికి బయలు దేరి వెళ్ళాము.
ఆ ఊళ్ళో మేము ఎక్కువ కాలంఉన్నాము అప్పట్లో ఒక ఇల్లు కొని అక్కడి స్నేహితులకి దాన్ని అప్పగించాను. ఆంధ్రాకు వచ్చాము అని పోన్ చేసి చెప్పగానే ఆ ఇంట్లో ఉన్న వాండ్లను నెల తరువా త ఖ్హాళి చేయించుతామని మీరు ఉండవచ్చు అని అన్నారు. నా శ్రీమతి అనారోగ్యము అధిక బ్లీడింగ్ మొ. వాటితో భాదపడుతూ ఉంది చిన్న పిల్లలు ఇద్దరు. అందరి బట్టలు డబ్బులు తప్పించి సామానేదీ మాతో లేదు.
మెల్లిగా ఆ ఊరు చేరుకొని మా స్వంత ఇంటి ప్రక్కనే ఒక చిన్న ఇల్లు ఒక నెలకై అద్దెకి తీసుకొని ఇంటికి కావలసిన సామాన్లు అన్నీ కొనుక్కున్నాము. స్టౌవ్వు నుండి ఫ్రిజ్జు వరకు అన్నీ మళ్ళీ కొనేసాం మా సామానంతా పరాయి రాశ్త్రంలోనే ఉండిపోయింది ఇప్పట్లో బదిలీ కాదు. కేసు ఎప్పటి వరకు అవుతాదో తెలియనందున ఇక అక్కడే వాళ్ళని ఉంచి, స్రీమతికి అక్కడే వైధ్యం చేయిస్తూ కేసుకై హైదరాబాద్ కి ఇక్కడికి నేను తిరగాలని నిర్ణయించుకున్నాము.
విషయం అంతా వివరించి టీసీ లేకుండానే పిల్ల లని స్కూలులో వేసాను.
ఆ మరు నెల మా స్వంత ఇంట్లోకి వెళ్ళాము. ఎనమిది నెలల లీవు తరువాత మేమున్న ఊరుకి నాకు బదిలీ జరిగింది. తరువాత తొందరలోనే నా కేసు పూర్తయ్యి ప్రమోషన్ రావడం జరిగింది.
ఇదంతా జరిగినప్పుడు పూర్వం నాతో ఎంతో సాహాయం పొందిన వాళ్ళంతా మొహం చాటేసారు. కొత్త మిత్రులు నన్ను కొంత ఆదుకున్నారు.
ముఖ్యంగా నన్ను ఆదుకున్నది నా డబ్బు మాత్రమే.
ఎంత ఇబ్బందిలోనూ మేము మా తల్లిదండ్రులని అడిగింది కేవలం తోడు మాత్రమే మేమున్నామన్న ఓదార్పు. అది వాళ్ళు ఇవ్వలేదు.
నాకు ప్రమోషన్ వచ్చాక విచిత్రంగా అందరు బంధువులూ వచ్చి పలకరించడం మొదలైంది.
మా అత్తగారికి మామగారికి అల్లుడి కొత్తహోదా ఎంతో నచ్చింది ఏ ఫీలింగు లేకుండా మావూరు వచ్చి అంగరంగ వైభోగంగా అథిధి మర్యాదలు స్వీకరించి నెల ఉండి వెళ్ళారు. వాళ్ళు వదులుకున్నట్టుగా రక్త సంబధీకులను వదులుకోలేని బలహీనత
ఐనా ఇలామ్టి సంఘటనలతో మానసికంగా వారితో మా బంధం తెగినట్టే.
శ్రీధర్ గారు,
నిజమే మీరన్నట్టు డబ్బున్నప్పుడే బంధువులు(అందరూ కాకపోవచ్చు)ఈ మాట నిజమే మరి.
"మీరు కూడ ఇంకెవరికైనా అవసరంలో ఆదుకొండి చాలు"
మీ సలహా తప్పకుండా పాటిస్తాను(అయినా ఇది నాకు ముందు నుండే అలవాటూ మా అమ్మ వల్ల)
స్పందనకు ధన్యవాదాలు.
mmmmm all the best bossssssss
srinivas garu mee kanthi garu kee hats off.chala chakkhagha meeku dyrayanni echharu todhugha nelabaddharu.
naku anipisthadhi vizag -city of destiny so akkhadha evvarikhi ayina adrushtam kalisivastthundhi.
plss evvaru tappugha anukovaddhu edhi kevalem Vizag pye abhimanam antey..
maa varu nenu edhi ayina samsya vastey vizag -tennithi park kii velli kaasepu anni samasayalu marchipoyi matladhu kontam adhi emitho aa taruvatha nijangha maaku solution dorukutundhi.
వినయ్...థేంక్స్ బాస్.
లావణ్య గారూ...స్పందనకు ధ్యనవాదాలు.విశాఖకు ఒక ప్రత్యేకత ఉంది లెండి,అదీ కాక మీరు ఏమి చెప్పిన ఎవరూ ఏమీ అనుకోరు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారిది కదా,విశాఖకు అభిమానులు కానివారెవరులెండి.తెన్నేటి పార్కులోనే కాదు ఆ లొకేషన్లో ఎక్కడా కూర్చున్నా ప్రపంచం మర్చిపోవచ్చు.నిజమే ఒక్కొకరిది ఒక్కొక్క నమ్మకం.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి