శనివారం 4 జూలై 2009

ఎన్‌.టీ.ఓడి సినిమా అనుభవం


పదోతరగతి వరకూ తెర మీద బొమ్మంటే(సినిమా)అప్పుడప్పుడు మా ఊరొచ్చి వేన్ ఎనకాల స్క్రీన్ మీద గ్రోమోర్(ఎరువుల ఎడ్వర్టజుమెంట్)వాళ్ళు వేసే బొమ్మ తప్ప ఇంకేమీ కాదు.మా వీధి మొదట్లో ఉండే ప్రెసిడెంట్ బుల్లెంకన్న గారింటి ఎదురుగా వేసే దానికి కూడా ముందు జాగా కోసం దెబ్బలాటే. హహహహ...
ఆ తర్వాత అమ్మతోటే అనుకుంటా(పెద్దాయన వైజాగెళ్ళినఫ్ఫుడేమో)అమలాపురం వెళ్ళి కాలేజ్ రోడ్లో ఉన్న వెంకటేశ్వరా టాకీసులో ఎన్.టి (NTR) ఓడిది "రాము" సినిమా చూసాను మొట్టమొదటిది. అందులో "రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులనూ కాపాడా రారా కృష్ణయ్యా" పాటా భలే బాగా నచ్చింది.
ఈడబ్బాని (ముద్దుగా తిట్టు) ఎన్‌టీ ఓడు కూడా సూపర్ గా ఏక్ట్ చేసేసాడు.ఏడుపు సన్నివేశాల్లో నోట్లో మొత్తం చెయ్యంతా కుక్కేసుకునో కూరేసుకునో, అమ్మో అక్కచెల్లో,ప్రియురాలో,పెళ్ళమో ఎవరయినా ఒకటే లెఖ్ఖన ధృతరాష్ట్ర కౌగిలింతలూ (ఆ ఏసం కట్టిన ఎవత్తయినా సరే ఇరిగిపోయిన లేక నుగ్గునుగ్గయిపోయిన ఎముకలన్నీ కొంగంచున చిల్లర కట్టుకున్న లెక్కన కట్టకట్టుకుని ఇంటికట్టుకెల్లి చింతపండు బెల్లం కట్టేసుకుని అతికించుకోవాల్సిందే), పాటల్లో చిన్న పరుగిచ్చి ఆగి ఒక్క జెర్కిచ్చి ముందుకు చెయ్యిసిరి వెనకాల కాలెత్తడం భలే రంజుగా ఉంటుంది.కానీ మొత్తానికి చాలా అందగాడు సూదిగా ఉండి ఆ చివర్లో కొండ కొమ్ములా భలే గమ్మత్తుగా వంపుతిరిగిన ముక్కూ, వత్తు "ధ" లాగుండే ఆ గడ్డం సూడముచ్చటౌద్దబ్బా..అందుకే నచ్చేసాడు వెంటనే అభిమానినయిపోయాను ఎన్‌టీ ఓడికి...వెండితెర సాక్షిగా.

సరే పదో కల్లాసయిపోగానే మా పెద్దాయన నన్నట్టుకెల్లి అదెక్కడో తణుకులో పడేసాడు సదువుకని మరి సుట్టాలింట్లో ఎట్టడం ఇట్టం లేక హాస్టల్లో కూకోబెట్టాడు కూడుకీ ఉండేదాలికీ, కర్సులకని సేతిలో ఓ కూతంత సొమ్ములెట్టాడు బాగా సదువుకోమని సెప్తూ(సెప్పినట్టుగా అనిపించింది ఆయన సూపులలాంటివి మరి మనమేటిసేత్తాము). అంతవరకూ అంత సొమ్ము సూసింది లేదు ఆ మద్దెప్పుడో సంతకెల్లినప్పుడు తప్పా, అందుకే పెద్దాయన ఆ మొగ తిరగ్గానే కయ్యిమని ఒక్క ఇజిలేసా బారద్దేశానికి సొతంతరం వచ్చేసినంత సంబడంగా.

దీన్‌తల్లి కొంపలో అమ్మమీద కానీ నాన్న మీద కానీ నానమ్మ మీద కానీ ధ్యాసలేకుండా పోయింది,ఈ పెంపకం అంతా మట్టికొట్టుకుపోనాది దెబ్బకి.ఎహే పోతే పోనాది ఎదవగోల ఇప్పుడెందుకు గానీ సినిమా సూడాలా అదీ ఎన్.టీ ఓడిదే ఎన్నిసార్లు ఈలయితే అన్నిసార్లూ తెర సింపి మరీ సితగ్గొట్టెయ్యాల.
సరే దీనికి తోడు ఆ కాలేజీ ఓడు యమా స్టిట్టూ ఈడబ్బాని కుర్రనాకొడుకులు కల్లాసులెగ్గొట్టకుండా భలే కాపుకాస్తాడు,ఆ ఓస్టెల్లోకూడ అంతే ఆ వాడ్రేవు గాడు(వార్డెన్). మరెలా బొమ్మ సూసేది,నా కోరిక తీరేది, గుల గుల్లాడిపోతా ఉంది పేణం ఎన్‌టీ ఓడి బొమ్మ సూసేదాకా. సరే ఈలోపున ఓస్టల్లో కూడు కెలుకత ఉంటే మా సర్వర్ సింతామణి గాడొచ్చాడు ఏటండీ ఏటీ ఓ ఆకుని కెలుకుతా ఉన్నారేంటి కతా ఆకు సిరిగి సత్తాది అంటూ..ఆహా అప్పుడు తట్టింది సూపర్ డూపర్ ఆలోశన బుర్రలో ఎంటనే కనుక్కున్నా ఏరా సింతా టౌనులో ఎన్.టీ ఓడి బొమ్మలేంటాడతన్నాయేంటీ అని.అప్పుడే ఎరుకయింది ఆడూ ఎన్‌టీఓడి అభిమాని అని,సరే మనోడే ఇంకేంటీ గొడవేలేదు, కల్సి కాపురం సేసెయ్యచ్చు ఇంచక్కా అనుకుంటూ పూటుగా లాగించా ఎన్‌టీ ఓడి మాదిరే. ఇంతలో సింతా టౌనులో బొమ్మ లేంటాడుతున్నయో సెప్తున్నాడు.ఆడు సెప్పటం నేనూహించుకోడం భలే గమ్మత్తుగా. పద్మశ్రీ లో సిక్కడూ దొరకడూ,యెంకటేస్పరాలో సిన్ననాటిస్నేహితులు,నరేంద్రా సిత్రమందిర్లో ఎదుర్లేని మడిసి, ఈరనారయణా లో గండికోట రగస్యం ఇంకా...
సాలబ్బీ మనకాడున్నా సొమ్ములకీ సినిమాలు సాలు,తర్వాత సంగతి తర్వాత సూద్దాంలే ఇప్పటికియి సాల్లే అని పంట్లాం బిగదీసి దివాణానికి చేరా. ఈలోపల రూమ్మేటు రంగా గాడొచ్చాడు ఏంట్రా ఏంటి ఫోగ్రాము ఇయ్యాల అంటూ.యేమీలేదెహె వచ్చి వారం పదిరోజులయినాది గందా ఏదన్నా బొమ్మ సూద్దామేంట్రా ఇయ్యాల అన్నాను అనగానే వాడు వాకే అన్నాడు.సరే ఇద్దరం ఎగేసుకుని బయల్దేరాం పద్మశ్రీ టాకీసుకి “సిక్కడూ దొరకడూ” సూడ్డానికి.సరే ఓ రెండు బెంచి టిక్కట్లు తీసుకుని తెరకి దగ్గరగా కూకోపోతే అసలు బొమ్మ సూసినట్టే ఉండదు అందులో ఎన్‌టీ్ఓడిది.
పాటొత్తే సాలు ఆడోకాలెగరేసి డేన్సాడా నేనిజిలెయ్యా అడు గేంతా నేనిజిలెయ్యా భలే సందడయ్యిందిలే
సాలు ఈ జన్మకీ ఎదవ పేణం పోయినా పర్లేద్దీంతల్లి మా వీరోది గొప్ప బొమ్మ సూసేసినా ఈపూట అనుకుంటా ఎన్‌టీ ఓడూ రాజనాలా గాడూ ఈర లెవెల్లో యమాగ పైటింగ్ సేసుకుంటాంటే ఆ ఇలన్ రాజనాల గాడనుకుంటా ఈలోపడ మనోడ్ని ఒక దెబ్బేశాడు అంతే మా ఎన్‌టీఓడ్ని కొట్టేటంత మొగాడివా నీయవ్వా అని కోపమొచ్చి ఇంటర్‌బెల్లులో హాలు కాడ కొనుక్కున్న జొన్నపొత్తు మొత్తం గోకేసినాక దాన్నిరగ్గొట్టి రెండు ముక్కలు సేసి ఇజిలెయ్యడానికడ్డమొస్తోందని అని సాగదీసి యెనక్కిసిరా. అంతే యెంటనే యెనకనించి సచ్చాన్రోయ్ బాబోయ్ అంటూ కేక అధాటున ఎంటనే లైట్లేయడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి,ఆ యేడిలో సూళ్ళేదుకానీ అదిగోరా కూతంత లేడు ఆ పొట్టినాకొడుకే ఇసిరినట్టున్నడ్రా అని అరుస్తుంటే అటుపక్కనించొకడు ఇటుపక్కనించొకడూ లగెత్తుకునొస్తా ఉంటే ఎంటనె నాకేదో దూరదృష్టి సైగలు చేసి లగెత్తు కొడకా లేకపోతే నీపనైపోద్దియ్యేల అంటే పక్కనున్న రంగా గాడ్ని కూడ రెక్కట్టుకుని లాక్కుని చిన్నప్పుడు ఆడిన కబడ్డీ,ఖొఖొ ఆటలన్నీ గుర్తుకురాగా హాల్లోంచి ఒక్క దూకు దూకి ఒకటే పరుగు లంకించుకున్నా ఎవడికీ సిక్కకుండా మల్లా కాలేజీ గేట్ దాకా ఎనక్కి సూడకుండా...
మల్లీ ఆ పద్మశ్రీ టాకీసుకెల్లలేదు కొన్నాళ్ళ వరకూ సరి కదా ఆ సందులోంచికూడ ఎల్లడం మానేసా ఈరనారాయణా టాకీసుకి అడ్డదారయినా కూడా.అదీ సంగతి.
ఈతూరి మల్లా ఇంకో బొమ్మ గురించి మాట్టడుకుందారి, అందాక ఏనఏల దణ్ణాలు అందరికీ...

14 వ్యాఖ్యలు:

Ashok చెప్పారు...

jambara jamba... super ga vundahe...

మురళి చెప్పారు...

ఒక్క టపాలో ఎన్ని మాండలీకాలు!! బాగుంది..ఓ అభిమాని గుండె చప్పుడు.. నాకు మాత్రం 'ఆరేసుకోబోయి..' పాట చూసినప్పుడల్లా ఒక్కటే ఆలోచన.. జయప్రద ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకుని ఉంటుందా అని :-)

harephala చెప్పారు...

నా పుట్టిల్లు అమలాపురం కాలేజీ రోడ్డులొ ఉన్న వెంకటేశ్వరా టాకీసూ, మా ఇంటావిడ పుట్టిల్లు అయిన తణుకు లో ఉన్న పద్మశ్రీ, వెంకటేశ్వరా, నరేంద్రా గుర్తుచేసినందుకు చాలా సంతోషం.

సుజాత చెప్పారు...

జయప్రద ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకుని ఉంటుందా అని :-)
మురళీ,
మీరు మరీనండీ! పాపం !

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

అశోకా..థాంక్సెహె,
మురళీ...జయప్రద కంటే ముందుశానామందుండారబ్బాయా,
దేవిక,రాజశ్రీ,జయలలిత,కృష్ణకుమారి,వాణిశ్రీ(నేను ఇతనితో చెయ్యను అని ఈవిడ తెగేసి చెప్పిందని వార్త కూడా ఎదురులేని మనిషి తర్వాత),ఆ తర్వాత జయప్రదా,ఇంకా "రాధాసలూజా" అని ఉంది ఒకామే(ఒక్కటే సినిమా టైగర్ అని)ఆవిడపరిస్థితేంటో...
హరేఫల గారు,
మీది కోనసీమే నాది కోనసీమే మనిద్దరిది కోనసీమే(మీది తెనాలే నాది తెనాలే స్టైల్లో చదువుకొండి)
అయితే మీకు నేను రెండు పక్కలా చుట్టాన్నన్నమాట...

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

సుజాతగారూ..మీరు మరీనూఊఊఉ...

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఆ మురళీ..."ఆరేసుకోబోయి" కన్నా "చిలకకొట్టుడు కొడితే చిన్నదానా" పాటకి(యమగోల)జయప్రద రేషన్ కార్డ్ చిరిగుండాలి...

Shiva Bandaru చెప్పారు...

"పద్మశ్రీ లో సిక్కడూ దొరకడూ,యెంకటేస్పరాలో సిన్ననాటిస్నేహితులు,నరేంద్రా సిత్రమందిర్లో ఎదుర్లేని మడిసి, ఈరనారయణా లో గండికోట రగస్యం "
పాలిటెక్నిక్ లో మీదే బాచ్ ?

కొత్త పాళీ చెప్పారు...

భలే.
కామెంట్లు చూసి నేనూ చిలక్కొట్టుడు పాట గురించే చెబుదామని వచ్చేప్పటికి అందరూ చెప్పేశారు. మనలో మాట, ఆ చిలక్కొట్టుడుతోనే జయప్రదగారి దశతిరిగింది.
ఏమాటకామాట చెప్పుకోవాలి, ఆరేసుకోబాయి పాటని రాఘవేంద్రుడు కొంచెం టేష్టుఫుల్గానే తీశాడు.

sunita చెప్పారు...

Haa!Haa!Ha! baagundi.aitae meeroo NTR ku tirugulaeni abhimaani annamaaTa.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

శివా,
బేచ్చేంటి అసలు అక్కడ చదివినట్టే మర్చిపోయా ఈ ఎన్ టీ ఓడీ దెబ్బకి...(అడవిరాముడు సినిమా రిలీజయినప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ ఎక్జాంస్ కరక్టుగా)
గురువు గారు,
మరే బాగా చెప్పారు,అది చూడ్డనికే ఫైనల్ ఎక్జాంస్ కూడ(ఎగ్గొట్టలేదు కానీ)పరీక్ష ముందురోజూ రాసాకా కూడా చూసేసా ఆ సినిమాని.
సునీత గారూ...అవునండీ ఆడే నా కొంప ముంచేసాడు,చదువు సంక నాకిపోయింది(ఏదో మెల్లిగా గెట్టెక్కించాసాననుకోండి)...

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

"పాటల్లో చిన్న పరుగిచ్చి ఆగి ఒక్క జెర్కిచ్చి ముందుకు చెయ్యిసిరి వెనకాల కాలెత్తడం భలే రంజుగా ఉంటుంది.కానీ మొత్తానికి చాలా అందగాడు సూదిగా ఉండి ఆ చివర్లో కొండ కొమ్ములా భలే గమ్మత్తుగా వంపుతిరిగిన ముక్కూ, వత్తు "ధ" లాగుండే ఆ గడ్డం సూడముచ్చటౌద్దబ్బా.."

అబ్బబ్బ కళ్ళక్కట్టీసినట్టు చెప్పేరండి! అదురో అదురు!

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

అయ్యా పద్య కంఠీరవా... నమస్సుమాంజలి.మిమ్మానందింపచేసినందుకు మా జన్మ చరితార్ధం అయినట్టే...

మురళి చెప్పారు...

పప్పువారూ.. మీరుదహరించిన మిగిలిన తారలు కొంచం భారీ విగ్రహాలు కాబట్టి అంతగా ఇబ్బంది లేకపోవచ్చు.. జయప్రద పాపం సుకుమారి కదా (కనీసం వాళ్ళతో పోల్చినప్పుడు..) అందుకన్న మాట! చిలక్కొట్టుడు కూడా.. నాకెందుకో మొదట ఆరేసుకోబోయి గుర్తొచ్చింది..
@సుజాతగారు.. పాపం జయప్రద !!!