
ఇంటి పెద్ద కొడుకు ఓ ఇల్లు కొనుక్కోడానికి కొంత సొమ్ము తగ్గింది మీరు సర్దండి అన్న దానికి నీకు మీ బేంకులో లోన్ వస్తే తీసుకో లేకపోతే బయటెక్కడన్నా అప్పు పుడితే తెచ్చుకో,ఒకవేళ అది నువ్వు ఏదన్నా విపత్కర పరిస్థితిలో తీర్చలేకపోయిన పక్షంలో నేను తీరుస్తాను.అంతే కానీ నా దగ్గరున్న సొమ్ము అప్పుగా ఇవ్వను అని తన పెద్ద కొడుకుతో తెగేసి చెప్పగల దమ్మున్న తండ్రి మీకు తెలుసా?
చిన్న కొడుక్కి ఉద్యోగప్రయత్నాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి లంచం ఇవ్వాల్సి వస్తే, లంచం ఇచ్చేపనే లేదు, నిన్ను నమ్మను, నిన్ను నమ్మి నేను కష్టపడి సంపాదించిన సొమ్ము నీ మీద పెట్టుబడి పెడితే రేప్పొద్దున్న మమ్మల్ని చూస్తావన్న గ్యారంటీ నాకు లేదు అని చిన్నకొడుకుని అనగలిగిన తండ్రి మీరెప్పుడయినా చూశారా?
మావగారంటే పిల్లనిచ్చాడు కాబట్టి అల్లుడి దగ్గర చెప్పండి బాబయ్యా ఏంకావాలంటే అది తలతాకట్టు పెట్టి తెచ్చిస్తా అని చేతులు నులుపుకుంటూనో,ఏదో నేరం చేసిన వాడిలా తలదించుకునో కాకుండా నేను పితృపంచకాల్లో ఒకడ్ని నాకు ఇవ్వాల్సిన మర్యాద నువ్వివ్వాల్సిందే, అల్లుడిగా నీకు నేనేమి చెయ్యాలో అది తప్పకుండా చేస్తాను అని పాత రోజుల్లోనే చెప్పగలిగిన మావగార్ని మీరెరుగుదురా?
పోయిన గోదావరి పుష్కరాల్లో మొదటిరోజే తన బావమరిది కాలంచేస్తే ఊరుఊరంతా పుష్కరాలకి వెళ్ళిపోతే, అంతిమయాత్రకు మోసుకెళ్ళే నలుగురు మనుషులు దొరక్కపోతే తన ఇద్దరు కొడుకులచేతా(తల్లితండ్రులు బ్రతికుండగా అలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోకూడదంటారు) ఇంకో ఇద్దరు మిత్రుల చేతా దగ్గరుండి మోయించి మరీ బావమరిది రుణం తీర్చుకున్న మనిషి మీకెక్కడయినా ఎదురయ్యాడా?
నీకు ఐదు పైసలివ్వాలా ఇదిగో తీసుకో,నాకు నువ్వు ఐదు పైసలివ్వాలా అయితే వెంటనే ఇచ్చేసెయ్యి అని మీరు నిద్రలో ఉన్నప్పుడయినా సరే లేపి ఇచ్చేసో లేక తీసుకున్నవ్యక్తి మీకెక్కడయినా తారసపడ్డాడా?
మా బాధ్యతగా మీకు చెయ్యగలిగింది చేసాను,ఇప్పుడు మీ బాధ్యతగా మీరు మాకు కావాల్సిన రీతిలో మేమిష్టపడ్డ విధంగా మేము బ్రతికున్నంత కాలం చూసుకోవాలి, ఏ పనీ పాటాలేకుండా మీదగ్గర పడి తింటున్నామని చిన్న చూపు చూడ్డానికి వీల్లేదు సుమా అని అని ఒక ఇంటిపెద్ద తన పిల్లలతో అని చచ్చేంతవరకూ అలాగే జరిపించుకున్న వైనం ఎక్కడయినా చూసారా?
సలహా అనేది ఆముదం లాంటిది. ఇచ్చేవాడికి సులభంగానూ పుచ్చుకునేవాడికి కష్టం గానూ ఉంటుందని నానుడి.అదికూడా తనవారా పెరవారా అనే బేధంలేకుండా ఇవ్వడం అనేది ఒక కళ.చక్కటి లౌక్యం తెలిసున్న వారికి మాత్రమే అది సాధ్యమని నాకనిపిస్తుంది.ఎక్కడ ఎవరికి ఏవిధమయిన సలహా ఎంత ఔన్సులో ఇవ్వాలో అంతపద్ధతిగానూ ఇవ్వగలిగిన వ్యక్తిని నేను అతిదగ్గరగా చూసాను. అది నాకు జీవితంలో చాలా నేర్పింది కూడా.
మన అవసరానికి సొమ్మివ్వకుండా సాయం చెయ్యకుండా ఓ చెత్తవెధవల్లా చూసిన పెద్దమనిషే కొన్నేళ్ళయ్యాక మేమేదోసాధించేసామని ఫోజులుకొడితే ఒరే వెర్రివెధవల్లారా నేనానాడు మీకు సాయం చేసి మిమ్మల్ని గట్టేక్కించేస్తే మీకు కష్టం విలువ తెలిసేది కాదురా కుంకల్లారా ఇలా మీకాళ్ళమీద మీరు నిలదొక్కుకోలేక పొయ్యేవారు కాదు, నేనున్నానని ధైర్యంగా గట్టుమీదున్న మిమ్మల్ని నీళ్ళలోకి తోసిందీ నేనే,చస్తామేమో అని ప్రాణభయంతో మీ అంతట మీరే ఈతనేర్చుకోడానికి అదే సాయపడింది అంతే నేను చేసింది, “ఆత్మావై పుత్రనామాశి” నా అంశమీద నాకెందుకు అపనమ్మకముంటుందని ఓ వేదాంతిలా చెప్తుంటే అటువంటి పెద్దమనిషిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నిజం చెప్పద్దూ గీతలో కిట్టపరమాత్మే గుర్తొచ్చాడు నాకయితే.
ఈ సోదంతా ఎందుకు ఎవరిగురించి అంటారా నాకు బాగా తెల్సిన ఓ పెద్దాయన గురించి,నాకు జన్మనిచ్చి బ్రహ్మోపదేశం చేసిన నా పిత్రుపాదుల గురించి,పిల్లలు ఎదిగొచ్చేసారు అని తను బాధ్యతగా చెయ్యాల్సిన మనవల ఒడుగు ముచ్చట్లు కూడా చెయ్యాల్సిన వయసులోనే చేయించేసి,
"దంతంబుల్పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే,
కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే,
వింతల్మేనుజరింపనప్పుడే,కురుల్వెల్వెల్ల గానప్పుడే,
చింతింపన్వలె నీ పదాంభుజములన్ శ్రీకాళహస్తీశ్వరా"
అని ధూర్ఝటి మహాశయులు సెలవిచ్చినట్టుగా, రామ”కోటి” రాసి చక్కగా ఆ శ్రీరామునికి తన స్వహస్తాలతోటే అంకితం ఇచ్చుకుని,దేవుడే ప్రత్యక్షమయి ఏమి కావాలో కోరుకొమ్మంటే "అనాయాస మరణం" ఎలా కోరుకుంటామో అలా ముందురోజు రాత్రి తనకిష్టమయిన జేసుదాస్ సంగీతవిభావరి కార్యక్రమం చూసి ఆనందించి,చక్కగా సైకిలుమీద ఇంటికొచ్చి వేడివేడిగా దిబ్బరొట్టి ఎర్రగా కాల్పించుకుని సుష్టుగా తిని,సుఖమయిన నిద్రపోయి, ఆ తర్వాతి రోజు సాయంత్రం గోదావరికెక్కి గోదారిదగ్గర (రాజమండ్రి) దిగాల్సిన పెద్దాయన ఆ మధ్యాహ్నమే చక్కటి కునుకుతీస్తూ అలాగే నిద్రలో "ఆ" అన్న శబ్దం పక్కగదిలో ఉన్నజనాల చెవులకి సోకేలోగానే గాఢసుషుప్తిలోకి జారుకుంటే అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి 84యేళ్ళ వయసులో.
ఆ రోజు ప్రయాణానికని రెడీ చేసి వంకీకి తగిలించిన పొందూరు ఖద్దరు లాల్చీలోంచి ఆరోజు వెళ్ళాల్సిన ట్రెయిన్ టిక్కట్టు చిరునవ్వుతో చూస్తోంది ఇంక నీకు నాతో పనిలేదన్నట్టుగా. నా అవసరం లేకుండానే నీప్రయాణం సాగిపోతోంది అన్నట్టుగా...
రౌడీ తన బ్లాగులో వేసిన పోస్టు చూసి తల్చుకుంటే పనులెందుకు అవవనిపించి భీష్మఏకాదశికి పోస్ట్ చేద్దామని అనుకున్నది వాయిదా పడుతూ ఇప్పటికి అయింది. దానికీ దీనికీ లింకేంటి అంటే మా పెద్దాయన పుట్టిన రోజు అదేరోజు అందుకని.అదీ విషయం.
అసందర్భమనిపించినా ఎందుకో రాయాలనిపించింది.
ఏదన్నా పనికొచ్చే పోస్ట్ వెయ్యచ్చు కదా ఈ కోతి వేషాలెందుకు అంటే మలక్ రాసిన హైకూ రామాయణం ముందుమాటలో "నా రాముడితో పరాచికాలాడతానా?" అన్న డైలాగు ఎక్కడో మనసులో సున్నితమయిన చోట తాకింది నాకు. అప్పుడు నాకు భక్తాంజనేయుడే కనిపించాడు మలక్ లో.
19 వ్యాఖ్యలు:
All I can say is ..
You dad was a lucky man to have a son like you!
ఇంతకీ హముమంతుడిని అని పొగిడారా? కోతి అని తెగిడారా నన్ను? :))
"ఇంతకీ హముమంతుడిని అని పొగిడారా? కోతి అని తెగిడారా నన్ను?"
రౌడీ కోతివేషాలు ఎందుకు అని నీకు సలహా ఇచ్చిన ఆమెకి అలా కనపడ్డావేమో కానీ,నాకు మాత్రం నేను పైన చెప్పిందే.
super post..
Good one :)
అదృష్టవంతులు మీరు.. అటువంటి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్న తండ్రిని పొందినందుకు! అదృష్టవంతులు మీ తండ్రిగారు.. తనని అపార్థం చేసుకోకుండా చక్కగా అర్థం చేసుకునే మీలాంటి కొడుకు ఉన్నందుకు!
సూపర్
చాలా బావుందండీ. మీరు, మీ నాన్నగారు కూడా సహృదయులు, అదృష్టవంతులు. అయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తే మా పెద్దనాన్నగారు కూడా, నేను ఆయన శిక్షణలో పెరిగి పెద్దదాన్నవడం నా అదృష్టం. ఆయన లేని లోటు ఎప్పటికీ తెలుస్తూనే ఉంటుంది నాకు.
అదృష్టవంతులు.మన మరణమే మనం జీవించిన విధానాన్ని తెలియజేస్తుందంట.మంచి జీవితాన్ని గడిపిన మీ నాన్నగారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని భగవంతున్ని ప్రార్థిసున్నాను.
Hatsoff to your father.!
ఆయన మాటల, చేతల వెనకున్న అంతరార్ధం తెలుసుకుని మసలుకున్నందుకు మీకు అభినందనలు. మీరిద్దరూ అదృష్టవంతులే :)
మనిషికి కావలసిన రెండూ.. (అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం) పొందిన అదృష్టవంతులు మీ నాన్నగారు.ఆయన వ్యక్తిత్వం మీరు చెపుతుంటేనే అద్భుతంగా తోస్తోంది.
అవును, మనిషంటే అలాగే బతకాలి!
అలాగే పోవాలి!
మీ నాన్నగారు మీకే కాదు మాకూ ఎప్పటికీ గుర్తుండేలా ఉంది మీ పోస్టు. ఆయన ఆత్మశాంతికేం ఢోకా లేదు.
తండ్రి గారి మీద చాలా చక్కగా వ్రాసారు. నా మనసులో నిలిచి పోయిన వాటిలో ఇది ఒకటి. Take care.
అద్భుతమైన మనిషి మీ నాన్నగారు. ఏది - ఎక్కడ - ఎంత - అన్న ఎరుకతో ప్రవర్తించడం ఒక తరానికి సాధారణం, మనకిప్పుడు అసాధారణం. మీ టపాల్లో అత్యుత్తమైనది.
- దీప
మీరు వ్రాసిన వ్యాఖ్య చాలా బాగుంది. కానీ అందరి తల్లి తండ్రులు అలా ఉండలేరు కదండి . మన కుటుంబం వరకు మనము మంచిగా చెప్పుకుంటాము కానీ అవతలవాడి దగ్గరకు వచ్చేసరికి మనము పాటించిన నీతి అవినీతి లను ఒప్పుకోలెం, మీరు వ్రాసిన వ్యాఖ్య లోనే ఉంది ఆముదం . తండ్రి గురించి అంతగా పొగిడే మీరు తల్లి గురించి కూడా ఆలోచించాలి . తండ్రి సంపాదించి తేస్తే సరిపోదు దానికి తగ్గ పని పాటలు తల్లి చెయ్యాల్సిందే . తల్లి చేసినవి చెప్పుకోలెం , అలాగని తల్లి కొడుకులు ఎంతటి మూర్ఖులు, వెధవలు అయినా కూడా మా పిల్లలు చాల మంచి వాళ్ళు అనే చెప్పుకుంటుంది అదే తండ్రి అలా చెప్పనేరడు. మీరే మీ గుండెలు మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీ తల్లి గురించి ఎంత బాగా చుసుకుంటున్నది. ఉదాహరణకు చెప్పాలంటే మనం చదివే పుస్తకాలలో కొన్ని సబ్జెక్టు పరంగా మన భవిష్యత్తు కి ఉపయోగ పడేలా ఉంటాయి , కొన్ని చదువుకుని ఆనందిచడానికి ఉపయోగ పడతాయి ఉదాహరణకు చందమామ , బాలమిత్ర లాంటివి. మీరు చెప్పింది కూడా అల్లాగే ఉంది.
ప్రతివాడు నేను కష్టపడ్డాను , నా తల్లి తండ్రులే అల్లచెసిఉన్దక పొతే నేను ఇలా ఉండే వాడ్ని కాదు, అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మంచి అయిన చెడు అయిన.
నీతి చెప్పాలంటే సులువు , పాత సామెతలు కాని ఎవరో వ్రాసిన శ్రీ శ్రీ పుస్తకాల్లో అనువాదాలు కానీ నాకు కాపీ చెయ్యడమంటే ఇష్టం కాని పని. మన కుటుంబం కోసమో మన కుటుంబ సభ్యుల కోసమో మనం ఏమిచేసమన్నది కాదు, పరులకి మనము ఏ విధంగా సహాయం అందిచాము అన్నది కూడా చూడాలి, అలా అని మన కున్నది మనం సంపాదించింది పంచిపెట్టమని చెప్పటంలేదు.
ఈ సోదంతా వద్దు గాని నేను చెప్పేదేమిటంటే మీరు వ్రాసినదంతా మీ గోప్పకే కాని అవతలవాడికి అద్దనకు ఉపయోగ పడదు. ఎవడి గొప్ప వాడు చెప్పుకోవడం కాదు అవతలవాడు మన గురించి మంచి చెప్పాలి
గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే : గులుగుంత పూసా తను ఎర్రగానే ఉంటుంది అని అనుకుంటుంది కాని తన ముడ్డి కింద నలుపు చూసుకోలేదు
ఎవరో బావమరిది గురుంచి వ్రాయటం కాదు నువ్వు ఒకరికి బావమరిది వే. నీ బావ గురుంచి వ్రాయి, అతని కొడుకు గురించి వ్రాయి . అప్పుడు మన వంశవృక్షం గురుంచి తెలిసేది.
అవతలవాడిని విమర్సించకు వెటకారము వద్దు. నువ్వే గొప్ప వాడివని అహంకారము వద్దు.
నీవు వ్రాసినడానికి నేను ఇచ్చే చిన్న వ్యాఖ్య ఇది. దీనిని వ్యాఖ్య లాగానే చదవాలి.
గ్రేట్ పర్సనాలిటీ... ఆయన్ని గురించి చదివే అదృష్టం మాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.
స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
@పోస్టంత కామెంటిన అజ్ఞాత గారు:"మీరు"దగ్గర మొదలుపెట్టి "నువ్వు" దాకా వచ్చి కామెంటారు బానే ఉంది కానీ ఏదో ఒకలెవెల్లో ఫిక్సయి కామెంటితే ఇంకా బావుండేది కదా.
ఇప్పుడు నా చరిత్ర అంతా రాయాలంటే చాలా టైము పడుతుంది,రాసాక వీలును బట్టి మీకు మెయిల్ చేస్తాలెండి.
అసలు మీ కామెంటు చదువుతుంటేనే నాకు బ్లాగుల్లో తలాతోకాలేని రాతలురాసే ఓ ప్రవతారం గుర్తొస్తోంది" ప్చ్.
"నీవు వ్రాసినడానికి నేను ఇచ్చే చిన్న వ్యాఖ్య ఇది. దీనిని వ్యాఖ్య లాగానే చదవాలి".
ఇంకా నయం కళ్ళద్దాలెట్టుకునే చదవాలనో,రంగనాయకమ్మ నవల లాగే చదవాలనో,స్టాలిన్ మ్యావో చరిత్రల్లా చదవాలనో చెప్పలేదు.
అదృష్టవంతులు.
ఒక మాట లో చెప్పాలి అంటే తాతగారిని మళ్లీ వెలుగు లోకి తెచ్చావు
నాకు తాతగరితో ఉన్న సాన్నిహిత్యం ఇంకెవేరికయీన ఉందేమో నాకు తెలియదు గాని,
ఆయన నాకు ప్రతీ విషయం లో ఇప్పటివరకు టీచర్ మెంటర్ గురువు
రోజు రాత్రి అతనితో తప్ప మా అమ్మ నాన్న తో పడుకోవడం నేను ఎరగను, మడత మంచం మీద నేను తమ్ముడు ప్లేస్ కోసం కొట్టుకోవడం నాకు చాలా గుర్తు తాతగరితో పడుకోవాలి అని
తాతగారు చిన్నప్పుడు నేర్పిన ఎక్కమ్ నుంచి రామాయణ మహాభారత కథలు నాకు పునాది రాళ్ళు
సంధ్యావందనం ఇప్పటికీ నేను చేస్తున్న అంటే ఆయన చెప్పినందువల్లే
నేను నా జీవితం లో ఎం సాధించిన నా ఉద్దేశం లో ఆది ఆయన నాకు పెట్టిన భిక్ష......అంతే
చక్కటి మార్గదర్శకులు మీ తండ్రిగారు. విశిష్ఠ వ్యక్తిత్వం కలిగిఉండడం ఒక కళ అయితే ఆ వ్యక్తిత్వాన్ని తనవాళ్ళే అర్థం చేసుకోడం గొప్ప కళ. అపార్థాలకి తావు లేకుండా ఆయన కచ్ఛితమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని , ఆయన మార్గాన్ని అనుసరించి కష్టపడి పైకి వచ్చి ఈ విధంగా పోస్ట్ ద్వారా అంజలి ఘటించడం మరువలేని మంచి బహుమతి.
టపా ద్వారా స్ఫూర్తినిచ్చారు.
నాగా,రమణి గారు...స్పందనకు ధన్యవాదాలు.
ప్రదీ..."నేను నా జీవితం లో ఎం సాధించిన నా ఉద్దేశం లో ఆది ఆయన నాకు పెట్టిన భిక్ష......అంతే" చాలా సంతోషం నాన్నా.కీప్ ఇట్ అప్
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి