
పొద్దున్నే ఆఫీసుకెళ్తుంటే ఓ కొలీగ్ మా చెన్నై లో ఇంజినీరింగ్ సీట్లు పంపకం పరమ చండాలంగా తయారయింది అంటూ మొదలెట్టాడు. అది వినగానే "రెండేళ్ళ క్రితం" జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది.
ఓ ఆదివారం రోజు పొద్దున్నే తిన్న టిఫిన్లు అరక్క యమాసీరియస్సుగా టీవీ లో వచ్చే ప్రకటనలు చూసేస్తుంటే 10గంటలా ప్రాంతంలో మా ఏకాగ్రతని దెబ్బతీస్తూ ఓ గొంతు వినబడింది.ఎవరా ధూర్తులు అని తలతిప్పి చూస్తే ఓ బక్క ప్రాణి మా ఫ్లేట్ ముందు నిలబడి నమస్తే లోపలికి రావచ్చా అని అడుగుతూ అభ్యర్ధిస్తున్నాడు.ఏమిటి విషయం అని కనుబొమ్మలు రెండూ పైకెగరేసి మరీ అడిగా,మళ్ళీ అదే అభ్యర్ధన,సరే తగలడు అని సిగ్నలిచ్చా, అంతే అదే మహా భాగ్యమన్నట్టు,మీరు ఫలానా వారు లాగి కొట్టిన బంపర్ లాటరీ దెబ్బకి కళ్ళుతిరిగి పడ్డారు, కోమాలోకెళ్ళకుండానే మీ నంబరిదిగో చూసుకోండహో,లగెత్తుకొచ్చెయ్యండహో అని తరచూ పంపే ఈమెయిల్సు నిజమే అన్నట్టూ మొహం పెట్టి కుర్చీలో కూలబడ్డాడు.
పాపం బాగా అలిసిపోయొచ్చాడని మా ఇంటావిడ ఓ గ్లాస్ నీళ్ళిచ్చింది,అది తాగి ఇంకా కావాలంటే అసలే నీళ్ళకి ఇబ్బంది కూల్ డ్రింకు తాగు నాయనా అని సీసాయే పట్టుకొచ్చింది ఏకంగా మహాఇల్లాలు.ముందు మొహమాటపడ్డా మొత్తం తాగేసి కాసేపయ్యాక ఊపిరి పీల్చుకుని మొదలెట్టాడు అసలు విషయం,మీ అబ్బాయి పదో క్లాసు అయ్యాక ఎందులో జాయిన్ చేస్తున్నారు అని అడుగుతూ.మా ఇంట్లో పదో క్లాసు దాటిన వాళ్ళెవరూ లేరు,కాళ్ళు తన్నుకుని పడిపోయినవాళ్ళే తప్ప అని హాస్యం ఆడాను పాపం అర్ధం కాక పేరూఊరూలేని రుచితెలియని వంట తిన్నట్టు మొహం పెట్టాడు.
సరే అసలు విషయం చెప్పు అని గసిరాక చెప్పాడు,ఆయనొక కార్పొరేట్ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ ట ఈ సెలవల్లోపల కొంతమంది కేండిడేట్లని వాళ్ళ కాలేజీలో జాయిన్ చేయించాలని మేనేజ్‌మెంట్ ఇతన్ని ఇలా ప్రచారం చెయ్యమ న్నారట.
ఇతన్ని చూస్తేనే ఇంకా కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడిలా ఉన్నాడు ఇతను లెక్చరర్ ఏమిటి అదీకాక వాళ్ళచేత ఇలా ప్రచారం చెయించడమేంటి అని అంటే వాళ్ళ కాలేజ్ మేనేజ్‌మెంట్ ఈ సెలవురోజుల్లో ఇలా ఇంటింటికీ తిరిగి కేండిడేట్లని చేర్చే కార్యక్రమం పెట్టిందనిన్ను,ఇంకా ముందుకెళ్ళి ఒక్కొక్కరికి ఇంతమంది అని కోటా కూడా పెట్టినట్టున్ను చూచాయగా తెల్సింది. ఈ కుర్రాడే కిందటేడో ఆ కిందటేడో పాసయ్యి ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాట్ట,వెధవది ఓ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లకాయలకి చెప్పడానికే అదేదో ట్రెయినింగూ అదీ ఇదీ అంటూ హడావిడి చేసేవారే కొన్నేళ్ళ క్రితందాకా,మరి ఇంతమంది భావిభారత ఇంజినీర్లు,డాక్టర్లూ,ఆర్ధిక నిపుణులు,తదితర చదువులు చదివేవారు ఇలాంటి కాలేజీల్లో ఇలా ఏ ట్రెయినింగులూ లేని లెక్చరర్‌విద్యార్ధులు చెప్పిన పాఠాలు విని ఏమి నేర్చుకుంటారు,ఆపైన ఉద్యోగాల్లో ఏమి ప్రతిభ ప్రదర్శిస్తారు. మరిలాంటి లెక్చరర్స్ ని పెట్టి చదువుచెప్పి ఆ కాలేజీలు ఎలా నంబర్ వన్,టూ అంటూ ర్యాంకులు ఇచ్చేసుకుంటున్నాయో తెలీదు. ప్రభుత్వానికి (ఆయా శాఖల మంత్రులకు) అందాల్సిన ముడుపులు అందేస్తే వారు కానీ వారి శాఖకు చెందిన ఆఫీసర్లు కానీ ఇటుపక్క చూడరనుకుంటా మరి,అదే విషయం అతన్ని అడిగితే అన్ని రికార్డులూ సవ్యంగానే ఉంటాయని సెలవిచ్చాడు.అవును మరే ఎందుకుండవూ,నిజమేలే వెధవపనిచేసేవాడికే తెలివితేటలెక్కువుండాలి అనుకుని,ఆ తర్వాతా కాసేపు ఏవో వివరాలు తీసుకుని అతను వెళ్ళిపోయాడు.
మళ్ళీ టీవీ లో శరీరం దూర్చబోతుంటే ఇంకోసారి అలికిడి అయ్యింది తలుపు దగ్గర అదే అభ్యర్ధన కాకపోతే మనిషి వేరే బహుశా ఇతను ఇంకో కాలేజి నించి వచ్చాడేమో అనుకున్నా,నిజమేట మాటల్లో తెల్సింది. "మనీ" సినిమాలో “కోటా” చెప్పినట్టు సేం స్టోరీ,సేం సమాచారం,కాలేజీ మారింది అంతే.అదీ విషయం.
అలా ఓ గంట తేడాలో 3-4 కాలేజీల వాళ్ళొచ్చి వివరాలన్నీ తీసుకుని వాళ్ళ కాలేజీలోనే మా పిల్లకాయని చేరుస్తామని ఒట్టేయించుకుని వెళ్ళారు. అసలు వీళ్ళకి ఈ పిల్లల వివరాలెలా తెలుస్తున్నాయి అంటేట వీళ్ళు ముందు ఆ చుట్టుపక్కల ఉండే అటువంటి కార్పొరేట్ స్కూళ్ళలో అక్కడ పనిచేసేవారితో చేతులు కలిపి సమాచారం మొత్తం తీసుకుని ఇలా ఇళ్ళకి వచ్చి టార్గెట్లు పూర్తిచేస్తారుట. అదీ సంగతి.
ఇంతకీ ఈ గోల చెన్నై లో సీట్ల పంపకాల గురించి వచ్చింది కదా,ఈ సీట్ల పంపిణీ వాటిని భర్తీ చేయడానికీ కూడా పైన చెప్పిన విధానమే అవలంబిస్తున్నారుట,కాకపొతే కొంచం భిన్నంగా సీనియర్ స్టూడెంట్స్ చేత ఆ పనిపూర్తిచేయిస్తూ వాళ్ళకి ఫీజుల్లో రాయితీలో మరి మార్కుల్లోనో ఇస్తూ పనికానిస్తున్నారని వార్త. ఇక్కడ విషయం ఇలా ఉంటే, ఆ సీనియర్ స్టూడెంట్స్ గ్రూపులుగా ఏర్పడి వాళ్ళకంటే వీళ్ళూ, వీళ్ళకంటే ఇంకో గ్రూప్ వాళ్ళూ ఎక్కువమందిని చేర్చాలని వాళ్ళలో వాళ్ళే అందరూ కొట్టుకు చస్తున్నారుట, లేకపోతే ఆ చేరడానికి వచ్చినవారినో చావ బాదుతున్నారుట.అదీ ప్రస్తుత పరిస్థితి మన విద్యా వ్యవస్థది.
విద్యావ్యవస్థలు రౌడీవిద్యార్ధుల్ని తయారుచేస్తూ తద్వారా భావిభారత అమాత్యులకు రంగం సిద్ధం చేస్తున్నాయి, భలే చిన్నప్పుడు చదువుకున్న గొంగళీ పురుగు వివిధ దశల్లో సీతాకోకచిలుకగా మారడం చదువుకున్నాము, ప్రత్యక్షంగా చూసాము కూడా,కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయి సీతాకోకచిలుక దశనించి గొంగళీపురుగు దశలోకి మారుతున్నారు అంతే తేడా. భారతదేశమా వర్ధిల్లు.
11 వ్యాఖ్యలు:
కాలేజీల అరాచకాలని సూటిగా చెప్పారు
అదిరింది పోస్ట్
కార్పొరేట్ స్కూల్స్ అనుకుంటే కాలేజీలు ఇదేదారిలో నడుస్తున్నాయన్నమాట. వేసవి సెలవుల్లో మా పాప చదివే స్కూల్ వాళ్ళొచ్చి మేం స్కూల్ మార్చమని ఒట్టేయించుకు వెళ్ళారు.
మీరు మాత్రం కాస్త జాగ్రత్తండోయ్ .....ఆ తలకి రంగదీ వేసుకోకండి కొన్నాళ్ళు . లేదంటే మిమ్మల్ని ఎత్తుకుపోయి వాళ్ళ కాలేజీలో జాయిన్ చేసేసుకుంటారు
హ హ హ మొత్తానికి మీ పిల్లలను ఎక్కడ చేర్చారు? ఇక్కడ కూడా వుత్తరాలతో రంగు రంగుల బ్రోచర్స్ లో మీ రాక మాకు శుభదాయకం అని మీకు విధాయకం అంటూ వూదరగొడతారు, అవునా అని అప్లికేషన్ పెడితే ఇక చంపుకొని తింటారు. మీ ఆస్తి ని, మీ అబ్బాయిని మాకు ఇచ్చెయ్యండి... అబ్బాయి చదువు గారెంటీ లేదు గాని, మీ అస్తి హారతి కర్పూరం చెయ్యటం మా చేతిలో పని అని నమ్మ బలుకుతారు.
పప్పు గారు, ఈ విద్య వ్యవస్థని కార్పోరేట్ పరం చేసింది ఎవరో మీకేమైనా తెలుసునా. పుట్టగొడుగుల్లాగా వీధికొక కాలేజీ/స్కూలు... వీళ్ళ దౌర్జన్యాన్ని అరికట్టేది ఎవరు. ప్రభుత్వమే అండగా ఉండి నడిపిస్తూ ఉంటే ఎవరిని ప్రశ్నించగలం. అయినా తల్లితండ్రులకి కూడా కొద్దిగా జ్ఞానం ఉండాలి. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప చదువు అని భావిస్తే ఇలా కాక ఎలా ఉంటుంది. అటు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్లు సైతం వీటి ఆకర్షణకి లోనై అక్కడ పిల్లలకి చదువు చెప్పకుండా ఎగ్గొట్టి పార్ట్ టైం పేరుతొ కార్పోరేట్ కాలేజీలో చేరుతున్నారు.
విద్యావ్యవస్థ కాదు, educational mafia . కొన్ని సంస్థల చేతిలోనే మొత్తం వ్యవస్థ వుంది. తల్లిదండ్రులు అలానే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, మేధావి వర్గాలు ఏం చెస్తున్నాయో తెలీడం లేదు. ఎప్పుడు కళ్ళు తెరుస్తారో గానీ ఈ లోపు ఒక తరాన్ని మొత్తం మానసిక రోగులుగా తయారుచేస్తున్నారు. చాలా బాధ అవుతుంది.
హ్మ్, ఇంకా అంధ్రాలొ మొదలెటలేదేంటి చెప్మా?
ఆహా! ఎంత అభివృధ్ధి చెందుతోంది మనదేశం?
అన్నింటికీ మార్కెటింగే.
తార గారూ,
ఆంధ్రాలో ఎప్పుడో మొదలైంది. మొన్ననే ఓ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఇల్లిళ్ళూ తిరగడం చూశాను.
కేక ఐతె నేను 2 BTech , 4 MBA ఆర్డరిస్తున్నాను
హరి...:D
లలిత గారు...స్కూళ్ళే కదా పునాది మరి అక్కడనించే మొదలయ్యినిది.కొంచం చిన్నా పెద్దా తేడా అంతే.మంచి సలహా ఇచ్చారు కాని వాడి గొయ్యి వాడే తవ్వుకున్నట్టే నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసుకుంటే.
భావన గారు...మనం చేర్పించక్కర్లేదు వాళ్ళే ఎత్తుకుపోతారు.కాకపోతే తర్వాతిచ్చే బిల్లే మనకి ఆసుపత్రెక్కడో చూపిస్తుంది.
స్వర్ణ గారు...విద్యావ్యస్థ కార్పొరేటీకరణ ప్చ్ ఎవరుచేసారో తెలీదండి.కానీ ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో బాగానే చెప్పేవారు కదా అవన్నీ బ్రష్టు పట్టిపోదంతో(పట్టించారు అనచ్చేమో)ఇలా ప్రైవేట్ కళాశాల వెనక్కాల పడాల్సొస్తోంది మరి. ఈ రెండు కార్యక్రమాలూ చాలా పద్ధతిగా జరిపించేసారనిపిస్తోంది నాకయితే. మరి తల్లితండ్రులు మాత్రం ఏమిచేస్తారు పాపం,గత్యంతరం లేకుండా చేసేస్తే.
జీవని...కరక్టుగా చెప్పారు. “Educational mafia”
తార..."ఇంకా ఆంధ్రాలో మొదలవలేదేంటి సెప్మా",ఎంతసేపు బాబూ ఈ రోగం అంటుకోడానికి.
బోనగిరి గారు...మరే వ్యాపారానికి మార్కెటింగ్ అవసరం లేదూ.
తారా...ఆర్డర్ ఇవ్వాల్సింది ఇక్కడ కాదు.గమ్మున పెళ్ళి చేసుకుని అర్జెంటుగా పదో కల్లాసు పాసయిపోయిన అబ్బాయినో అమ్మాయినో కనేస్తే వాళ్ళే ఆటోమేటిగ్గా నీ వెనకాల పడతారు.అప్పుడివ్వచ్చు ఆర్డర్.
Yes, regarding this aspect, few days ago, a student was killed brutally on OMR road.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి